71వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో అబ్దుల్ అజీజ్....
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు నగర సమగ్రాభివృద్ధికి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. 71వ డివిజన్‌లో కూటమి బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అలియాకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఈసారి కార్పొరేటర్‌కు, మేయర్‌కు వేర్వేరుగా ఓటు వేయాల్సి ఉంటుందని తెలిపారు. కార్పొరేటర్ అభ్యర్థి అలియాకు గాజు గ్లాసు గుర్తుపై, మేయర్ అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అలియా విజయానికి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థ సమన్వయంతో పనిచేస్తే స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి నారాయణ చొరవతో నెల్లూరులో తాగునీరు, భూగర్భ డ్రైనేజీ పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. తాను మేయర్‌గా ఉన్న 2014–2019 కాలంలోనే తాగునీటి పథకం పనులు 75–80 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం పెండింగ్ పనులను పూర్తిచేసి, డిసెంబర్ చివరినాటికి ప్రతి ఇంటికీ తాగునీరు, జూన్ నాటికి భూగర్భ డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. నగరంలో పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు, పేద పిల్లలకు మెరుగైన విద్య అందించేందుకు ఇప్పటికే 12 మున్సిపల్ పాఠశాలలను ఆధునికీకరిస్తున్నారని తెలిపారు. మిగిలిన పాఠశాలలనూ అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారన్నారు. మైనారిటీ పిల్లల కోసం వక్ఫ్ బోర్డు స్థలంలో రూ.20 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాలను నిర్మిస్తున్నామని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వారి వెంట జమీర్, షాహిద్ తదితరులు ఉన్నారు.