35 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం
నెల్లూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన బీ ఫారాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా బీ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నిబంధనలు, క్రమశిక్షణకు అనుగుణంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఎన్నికల్లో సమర్థవంతంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాలోని 35 ZPTC స్థానాల్లో అభ్యర్థులు సమన్వయంతో పనిచేసి ప్రజల మద్దతును కూడగట్టుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమవుతూ, కూటమి బలోపేతానికి కృషి చేయాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.