|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:51 PM
'కాస్త పొద్దెక్కితే చాలు ఎండలు దంచికొడుతున్నాయి. మంచినీళ్లు ఎంత తాగినా దాహం తీరటం లేదు. నోరు ఎండుకు పోతోంది. సల్లగా ఓ బీరేస్తా కానీ ఈ దాహం తీరెట్టు లేదు. అర్జెంటుగా ఓ బీరు లాగిద్దాం..' అనుకుంటూ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మందుబాబు మద్యం దుకాణానికి వెళ్లాడు. జేబులో నుంచి డబ్బులు తీసి చిల్డ్ బీర్ ఇవ్వాలని వైన్స్ యజమానికి అడిగాడు. ఆ వెంటనే ఫ్రిజ్‌లో నుంచి చల్లని బీరు తీసి ఇచ్చాడు. ఇంకేముందు సిట్టింగ్‌లో కూర్చొని తాగేద్దామని మనోడు స్టఫ్‌కు కూడా రెడీ చేసుకున్నాడు. బాటిల్ మూత ఓపెన్ చేద్దామనుకునే సరికి బీరులో ఏదో తిరుగుతున్నట్లు అనిపించింది. అందులో కనిపించింది చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే బీర్ బాటిల్‌లో ఓ చేపపిల్ల ఈదుతూ కనిపించింది. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్‌లోని జేపీ వైన్ షాపుకు శుక్రవారం (మార్చి 6) సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. మద్యం దుకాణంలో కింగ్‌ఫిషర్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు. బీర్ తాగేందుకు మూత ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా.. అందులో చేప పిల్ల కదులుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సదరు మందుబుబు.. వెంటనే వైన్ షాప్ నిర్వాహకుడిని ప్రశ్నించాడు. అయితే సదరు మందుబాబుతో వైన్ షాపు నిర్వాహకులు దురుసుగా మాట్లాడాడు. బీర్లు తాము తయారుచేయమని.. ఏదైనా సమస్య ఉంటే బీర్లు తయారుచేసిన కంపెనీని అడుక్కోవాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో మందుబాబు ఆగ్రహం వ్యక్తం చేశాడు. బీర్ బాటిల్‌లో చేప కదలడాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 'స్టఫ్ ఫ్రీ గా వచ్చింది దానికేందుకు షాక్ అవ్వడం.. మంచింగ్‌కి.. ఫిష్ కూడా ఇస్తే ఎంకరేజ్ చెయ్యరా మనసులేని పాడు లోకం..' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అది కింగ్ ఫిషర్ బీరు కదా.. అందుకే ఫిష్ స్విమ్మింగ్ చేస్తుందని.. రూ.180 పెట్టి బీరు కొంటే స్టఫ్‌గా ఫిష్ ఇచ్చారు దాంట్లో తప్పేముందని ఫన్నీగా కామెంట్లు పోస్టు చేస్తున్నారు. కాగా, గతంలోనూ ఇలా బీర్ బాటిల్స్‌లో పాము పిల్లలు, తేళ్లు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్నాయి.