|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 07:43 PM
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజున 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తాజాగా లొంగిపోయినవారితో కలిపి ఇప్పటి వరకూ తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారి నుంచి 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతతో పాటుగా ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పారు.
మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి అందించనున్న సంగతి తెలిసిందే. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత.. వారు జీవించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించనుంది. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులకు వారి కేడర్ ఆధారంగా రివార్డు అందిస్తారు. డివిజనల్ కమిటీ సభ్యులు అయితే రూ.5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులు అయితే రూ.4 లక్షలు, మావోయిస్టు పార్టీ సభ్యులకు రూ.లక్ష నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా లొంగిపోయేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తారు.
మరోవైపు శనివారం రోజున లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన మావోయిస్టులు ముగ్గురు ఉన్నారు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మరోవైపు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవటం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గణపతి కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు మెరుగైన పరిహారంతో పాటుగా ఆరోగ్య భద్రత, ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తామన్నారు.నగదు బహుమతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని.. చట్టపరంగా ఎత్తివేసేందుకు అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.