|
|
by Suryaa Desk | Fri, Jan 16, 2026, 02:02 PM
కూకట్ పల్లి నల్ల చెరువులో పండగ వాతావరణం నెలకొంది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పతంగులు ఎగురవేయడంతో అందరిలో జోష్ కనిపించింది. తన బాల్య, యవ్వన జీవితాన్ని గుర్తుకు తెచ్చుకొని పిల్లలు, యువకులతో కలసి పతంగిని ఎగురవేశారు. స్థానికుల ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ కూకట్పల్లి నల్ల చెరువు చెంత కైట్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2024 సెప్టెంబరులో ఇక్కడ చెరువు విస్తరణ చేపట్టినప్పుడు తీవ్ర నిరసనలు ఎదురయ్యాయని.. నేడు పండగ వాతావరణం నెలకొందని అన్నారు. కబ్జాలతో 16 ఎకరాలకు కుంచించుకుపోయిన నల్ల చెరువును 30 ఎకరాలకు విస్తరించామన్నారు. 10 అడుగుల మేర పేరుకుపోయిన పూడికను తొలగించి చెరువుకు మురికిని వదిలించామన్నారు. చెరువు లోతును పెంచడం ద్వారా పరిసర ప్రాంతాల్లో వరదలకు చెక్ పెడుతున్నామన్నారు. పై మెరుగులు దిద్దడం కాకుండా చెరువుల అభివృద్ధి అంటే యిలా ఉండాలని నిరూపించామన్నారు. ఇప్పుడు చెరువును చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉందని.. మరిన్ని అందాలు సమకూర్చుతున్నామని చెప్పారు. ఇక్కడకు 5 కిలోమీటర్ల నుంచి వచ్చి వాకింగ్ చేస్తున్నట్టు పలువురు చెప్పడం చాలా ఆనందంగా ఉందన్నారు. షటిల్ కోర్టు,కమ్యూనిటీ హాల్, యోగ కేంద్రం, సైకిల్ ట్రాక్, పికిల్ బాల్ యిలా అనేక క్రీడలు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇవన్నీ ప్రజలు ఉచితంగా వినియోగించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు.