|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 09:10 PM
హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. అయితే ఈ మౌలిక సదుపాయాల నిర్మాణాలు జరిగేటప్పుడు.. ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తారనే విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో తాజాగా మరో మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. మలక్‌పేట్ ఫైర్ స్టేషన్ నుంచి యాదగిరి థియేటర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల జరుగుతున్నందున ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. గురువారం (జనవరి 15 నుంచి నెల రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నట్లు వెల్లడించారు.
ఈ నెల రోజుల సమయంలో సైదాబాద్ వై జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ వెళ్లే మార్గంలో ఒక వైపు (దోభీఘాట్ వైపు) రోడ్డు మూసివేస్తారు. నల్గొండ ఎక్స్ రోడ్, ఒవైసీ హాస్పిటల్ (డిఎంఆర్ఎల్ జంక్షన్) మధ్య ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. ఆ మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించవద్దని ట్రాఫిక్ అధికారులు సూచించారు.
దారి మళ్లింపులు / ప్రత్యామ్నాయ మార్గాలు..
నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి సైదాబాద్ వై జంక్షన్ మీదుగా సంతోష్ నగర్, ఐఎస్ సదన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను.. సైదాబాద్ వై జంక్షన్, డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం, సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, సరస్వతి నగర్ కమాన్, సంకేశ్వర్ బజార్, ఇండియన్ పెట్రోల్ బంక్, సింగరేణి కాలనీ, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్ మీదుగా మళ్లించారు. ఈ మార్గంలో చంపాపేట్ ఎక్స్ రోడ్ వద్ద యూ-టర్న్ తీసుకుని ఐఎస్ సదన్ వైపు వెళ్లాలి. కాగా, ఈ ప్రత్యామ్నాయ మార్గంలో ఫోర్ వీలర్, ఆర్టీసీ బస్సులు, భారీ సరుకు రవాణా వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది.
చంచల్‌గూడ నుంచి ఐఎస్ సదన్ వైపు వెళ్లే బైక్‌లు, ఆటోలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద.. సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, 105 బస్ స్టాప్, రామాలయం కమాన్, లక్ష్మీ నగర్, బిస్కెట్ ఫ్యాక్టరీ, దోభీఘాట్ జంక్షన్ మీదుగా.. ఐఎస్ సదన్ ప్రధాన రహదారికి మళ్లిస్తారు. కాగా, చంచల్‌గూడ నుంచి చంపాపేట్ వైపు వెళ్లే బైక్‌లు, ఆటోలను సైదాబాద్ వై జంక్షన్, సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, 105 బస్ స్టాప్, రామాలయం కమాన్, లక్ష్మీ నగర్, వినయ్ నగర్, భారత్ గార్డెన్ మీదుగా.. ఐఎస్ సదన్, చంపాపేట్ ప్రధాన రహదారికి మళ్లిస్తారు.
చాదర్‌ఘాట్ నుంచి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను.. నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మలక్‌పేట్ గంజ్, మూసారాంబాగ్ ఎక్స్ రోడ్, గడ్డిఅన్నారం (యూ-టర్న్), గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్, శివ గంగా థియేటర్, హనీఫియా మసీదు (సరూర్‌నగర్ లేక్), ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, సింగరేణి కాలనీ, చంపాపేట్ మెయిన్ రోడ్ నుంచి మళ్లిస్తారు. ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ నుంచి ఐఎస్ సదన్, చంపాపేట్ వైపు వెళ్లే టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలను నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద.. మలక్‌పేట్ గంజ్, మూసారాంబాగ్, దిల్‌శుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు.