|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 04:00 PM
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లో మునిగిపోతుందని ఆనాడు కొందరు అసత్యాలు ప్రచారం చేశారని... ఆ మాటలను తెలంగాణ పటాపంచలు చేసిందని అన్నారు. ఆనాడు అసత్యాలు ప్రచారం చేసిన వారే ఇప్పుడు చీకట్లో మిగిలిపోయారని, తెలంగాణ మాత్రం వెలుగుల్లో మెరిసిపోతోందని చెప్పారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారిందని కేటీఆర్ అన్నాను. దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పవర్ ప్రాజెక్టుల్లో ఒకటైన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నాలుగో యూనిట్ లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని చెప్పారు. ఇది తెలంగాణ విద్యుత్ రంగంలో పెద్ద మైలురాయి అని అన్నారు. కేసీఆర్ స్వప్నాన్ని సాకారం చేసిన విద్యుత్ శాఖ ఇంజినీర్లు, సిబ్బంది, భాగస్వాములందరికీ అభినందనలు తెలిపారు.