|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 01:28 PM
హైదరాబాద్ లో వరుస హత్యలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే చోటుచేసుకున్న పలు ఘటనలతో నగరవాసులు భయంతో ఉన్న వేళ, తాజాగా బోరబండ ప్రాంతంలో జరిగిన ఓ యువతి హత్య మరింత కలకలం రేపింది. చిన్న అనుమానం ఓ యువతి ప్రాణాలు తీసేసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మృతురాలిని ఖనీజ్ ఫాతిమాగా గుర్తించారు. ఆమె గతంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పనిచేసే సమయంలో జహీర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే కొంతకాలం క్రితం యువతి ఉద్యోగం మారి ఊర్వశి బార్‌లో పని చేయడం ప్రారంభించింది. దీంతో ఇద్దరి మధ్య మాట్లాడటం తగ్గిపోయింది.ఈ పరిస్థితిని జహీర్ తప్పుగా అర్థం చేసుకున్నాడు. తనను ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతోందని, నిర్లక్ష్యం చేస్తోందని అనుమానంతో లోపలే లోపల కుంగిపోయాడు. అదే సమయంలో ఆమెపై ద్వేషం పెరిగింది. మాట్లాడుకుందామని చెప్పి యువతిని కలవడానికి పిలిచిన జహీర్, ఆ మాటల మధ్యే ఆమెపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు.యువతి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, విచారణ ప్రారంభించిన బోరబండ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ కాల్ రికార్డుల ప్రకారం నిందితుడిని గుర్తించారు.