|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 05:28 PM
మహిళా ఐఏఎస్ అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మీడియాలో వచ్చిన కథనాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని అన్నారు. కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా మీడియా కథనాలు రాయడం సరికాదని హితవు పలికారు.నల్గొండ జిల్లాలోనే కాదని, చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీలు జరిగాయని ఆయన అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందని వ్యాఖ్యానించారు. అధికారుల మీద అభాండాలు వేయడం సరికాదని అన్నారు. రేటింగ్‌లు, వ్యూస్ కోసం కాకుండా, వాస్తవాలు రాయాలని సూచించారు.ఛానళ్ల మధ్య రేటింగ్ పోటీ కోసం అధికారులను, ముఖ్యంగా మహిళా అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. కేవలం మంత్రుల పైనే కాదని, ముఖ్యమంత్రిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.