|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 08:59 PM
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో పేద విద్యార్థుల పాలిట వరంగా మారిన శ్రీసత్యసాయి ప్రశాంతి నికేతనం బాల మందిర ట్రస్టు, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రకటన విడుదల చేసింది. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ ద్వారా నిరుపేద విద్యార్థులకు అత్యున్నత స్థాయి విద్యను, వసతిని పూర్తి ఉచితంగా అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. గ్రామీణ విద్యార్థులకు ఈ సేవా ట్రస్ట్‌లో చదువుకునేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. దాదాపు 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రకృతి ఒడిలో ఈ విద్యాసంస్థ నడుస్తోంది.
ప్రస్తుతం ఆరవ తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల కోసం నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ విధానాన్ని అనుసరిస్తూ.. ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగుతుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని కళాశాల ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. కేవలం ఒక జత దుస్తులతో వచ్చే విద్యార్థులకు మిగిలిన అన్ని అవసరాలను ట్రస్టు చూసుకుంటుంది.
ఈ గురుకులంలో అడ్మిషన్ దొరికితే చదువుతో పాటు.. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విభిన్న శిక్షణలు ఇస్తారు. విద్యార్థుల అభిరుచిని బట్టి సంగీతం, నాట్యం, వివిధ రకాల క్రీడల్లో నైపుణ్యం పెంచుతారు. కంప్యూటర్ అప్లికేషన్స్ నేర్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారు. నిత్య జీవితంలో అవసరమయ్యే వంటలు చేయడం, వాహనాలు నడపడం (డ్రైవింగ్), కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇంటర్మీడియట్ తర్వాత కూడా శ్రీసత్యసాయి యూనివర్సిటీ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ద్వారా డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వరకు ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది.
పీజీ చదువుతున్న విద్యార్థులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రతి నెలా స్టైపెండ్ లేదా ఉపకార వేతనం కూడా అందజేస్తారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మిషన్ సేవా కేంద్రాల్లో రెండేళ్ల పాటు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తారు. దీని ద్వారా విద్యార్థులకు సామాజిక సేవపై అవగాహన పెరుగుతుంది. భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాల బోధన ద్వారా నైతిక విలువలను పెంపొందించడం ఇక్కడి ప్రత్యేకత.
అర్హత గల విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. పూర్తి వివరాలకు శ్రీసత్యసాయిలోకసేవా గురుకులం అనే వెబ్సైట్ సందర్శించవచ్చు. ఈ సేవా ట్రస్ట్ బ్రాంచ్‌లు ఒక్క సిద్దిపేటలోనే కాకుండా.. తమిళనాడులో ఒకటి, కర్ణాటకలో 17 జిల్లాల్లో ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కొండపాక సత్యసాయి క్యాంపస్‌కు సంబంధించిన వివరాలకు, దరఖాస్తు కోసం https:///ssspnk.org/ వెబ్‌సైట్ సందర్శించండి.