|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 05:31 PM
తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితిపై విపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భూ మాఫియా గుండాల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏకశిల నగర్‌లో జరిగిన ఘోరమైన దాడి ఈ పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలోని ఏకశిల నగర్‌లో భూ వివాదం నేపథ్యంలో రౌడీ మూకలు విచక్షణా రహితంగా కత్తులతో దాడికి తెగబడటం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన.. ఏకశిలా నగర్ లో భూ మాఫియా సాగించిన దౌర్జన్యాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఏకశిలా నగర్ ఘటన ఒక పరాకాష్ట అని మండిపడ్డారు.
'తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. భూ మాఫియా గుండాల ఆగడాలు రోజు రోజుకు మితిమీరి పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏలుబడిలో భూ మాఫియా రౌడీలు బహిరంగంగా ప్రజల ప్రాణాలు తీయడానికి కత్తులతో విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నా నిచ్చేస్టులై చూస్తున్న యంత్రాగం.. మాఫియాకు కొమ్ము కాస్తూ ప్రజల ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల పనితీరుకు, చేతకాని తనానికి పరాకాష్ట ఏకశిలా నగర్లో జరిగిన దాడి.
స్వయంగా ఒక ఎంపీ ఏకశిలా నగర్‌లో జరుగుతున్న గుండాల అరాచకాలను బయటపెట్టినా.. అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించిన తర్వాత కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. ఈ ఘటనను ఊరికే వదిలిపెట్టం. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేలా మా కార్యచరణ ఉంటుంది. బాధితులకు అండగా ఉంటాం. న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగుతుంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.' అని ఈటల రాజేందర్ హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడితే ప్రజలు క్షమించరని, తక్షణమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.