|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 01:32 PM
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలైన రాజకీయ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని ఉద్ఘాటించారు. ఆదివారం నాడు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ముఖ్య నేతలతో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపు కేవలం గాలివాటం మాత్రమేనని కొట్టిపారేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని, క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి బలం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.గడిచిన 24 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యాలతో నిండిపోయిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను, హామీల వంచనను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.