|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 12:40 PM
సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి రవాణాలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (స్త్రీ శక్తి) అమలులో ఉండటంతో, అక్కడ స్థానికంగా రద్దీ పెరిగింది. దీనివల్ల ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణ నుంచి నడిపే ప్రత్యేక బస్సుల సంఖ్యను భారీగా తగ్గించింది.గత ఏడాది తెలంగాణ నుంచి 2,000 ప్రత్యేక బస్సులను నడిపిన ఏపీఎస్‌ఆర్టీసీ, ఈసారి కేవలం 200 సర్వీసులకే పరిమితమైంది. దీంతో ఆంధ్రకు వెళ్లే ప్రయాణికుల భారం టీజీఎస్ ఆర్టీసీపై పడింది. ఈ రద్దీని తట్టుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. పండుగకు వెళ్లేవారితో పాటు, తిరిగి వచ్చే వారి కోసం జనవరి 18, 19 తేదీల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాగా, ఈ స్పెషల్ బస్సులకు సాధారణ చార్జీల కంటే 1.5 శాతం అదనపు చార్జీలు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.