|
|
by Suryaa Desk | Wed, Jan 14, 2026, 07:23 PM
సంక్రాంతి వేళ రంగురంగుల గాలిపటాలు ఎగురవేయడం అందరికీ సరదాగా ఉంటుంది. కానీ, ఆ గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే 'చైనా మాంజా' మాత్రం (నైలాన్ లేదా సింథటిక్ దారం) ప్రాణాల మీదకు తెస్తోంది. దీని వల్ల చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల నిజామాబాద్‌లో చైనా మాంజా కారణంగా ఓ బాలుడికి తీవ్ర గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అతడికి 20 కుట్లు పడ్డాయి. ఇదే కాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి ప్రాణాల మీదికి తెచ్చింది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ నాగరాజు.. చైనా మాంజా కారణంగా గొంతు కోసుకుపోయి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఉదంతాలు మరువకముందే.. చైనా మాంజా కారణంగా సంగారెడ్డి జిల్లాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది.
చైనా మాంజా కారణంగా మరో ప్రాణం పోయింది. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అవిదేశ్ (35) అనే వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఫసల్వాది ప్రాంతం వద్ద అవిదేశ్ మెడకు.. చైనా మాంజా చుట్టుకుంది. బైక్‌పై వేగంగా వెళ్తుండగా.. మాంజా మెడకు చుట్టుకోవడంతో అతడి గొంతు తెగింది. దీంతో అవిదేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చైనా మాంజాపై కఠిన చర్యలు..
రాష్ట్రంలో ఇప్పటికే చైనా మాంజాపై నిషేధం విధించారు. చైనా మాంజా అమ్మినా, కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. చైనా మాంజా ఉపయోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా చైనా మాంజా వాడకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో పోస్టు పెట్టిన ఆయన.. గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయకుల ప్రాణాల్లో కాదన్నారు. "చైనీస్ మాంజా దారం తెగదు.. కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుంది. మీ క్షణికానందం.. మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదు. నిషేధం విధించిన చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు తప్పవు. పండుగని పండుగ లాగానే జరుపుకోండి. ఇతరుల ప్రాణాలు తీసి కాదు!" అని ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు.
సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ కూడా సోషల్ మీడియా వేదికగా చైనా మాంజాపై అవగాహన కల్పించారు. చైనా మాంజా వినియోగం నిషిద్ధం అని.. వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవన్నారు. పండుగ సుఖసంతోషాల నడుమ పండగను జరుపుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా ఒకరి ఆనందం, మరొకరికి విషాదం కాకూడదని చెప్పారు. కాగా, చైనా మాంజాను బ్యాన్ చేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒకదగ్గర ప్రమాదాలు జరుగుతూనే ఉండటం ఆందోళనలు కలగిస్తోంది.