|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 03:03 PM
హైదరాబాద్ నగరంలో నిషేధిత చైనా మాంజా మరోసారి ప్రాణాల మీదకు తెచ్చింది. సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గాలిపటాలు ఎగరేయడం ఎక్కువవడంతో, ఈ ప్రమాదకరమైన దారం వాహనదారుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. తాజాగా, విధి నిర్వహణ కోసం బైక్‌పై వెళ్తున్న ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) గొంతుకు మాంజా చుట్టుకోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉప్పల్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బందోబస్తు విధులకు వెళ్తున్న ఏఎస్ఐ, స్వరూప్ నగర్ సమీపంలోకి రాగానే గాలిలో తేలుతున్న చైనా మాంజా దారం ఆయన మెడకు చిక్కుకుంది. పదునైన గాజు పూత ఉన్న ఆ దారం వల్ల ఆయన గొంతుకు లోతైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించి, ప్రమాదకరమైన మాంజా వల్లే ఈ గాయమైందని ధ్రువీకరించారు.