|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:03 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ పదవి కోసం 25,654 నామినేషన్లు, వార్డు స్థానాలకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ప్రక్రియ వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు.. తన ప్రియురాలు శ్రీజతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించాడు. ఈ గ్రామంలో ఎస్సీకి సర్పంచ్ స్థానం రిజర్వ్ అయింది. దీంతో పెళ్లి చేసుకోకుండానే ప్రేయసితో నామినేషన్ వేయించాడు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఆ యువతి బీటెక్ ఫైనల్ ఇయర్ చదవుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు చెప్పకుండా సదరు యువతి.. ప్రియుడితో కలిసి నామినేషన్ వేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు.. తమ కూమార్తె కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమకు రక్షణ కల్పించాలంటూ యువతి, యువకుడు కూడా పోలీసులను ఆశ్రయించారు. తన ఇష్టంతోనే చంద్రశేఖర్ వద్దకు వచ్చానని యువతి చెప్పింది. తనను ఎవరూ బలవతం చేయలేదని తెలిపింది. అనంతరం తనను గెలిపించాల్సిందా గ్రామంలో ప్రచారం చేసింది.
ఇలాంటి ఘటనే కరీనంగర్ జిల్లాలో జరిగింది. గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన ముచ్చె శంకర్ అనే వ్యక్తికి సర్పంచ్ కావాలనే చిరకాల కోరిక ఉంది. ఎన్నికల కోసం ఎప్పటినుంచో సన్నద్ధమవుతున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకుని తన భార్యను సర్పంచ్ కుర్చీలో కూర్చోబెట్టి చక్రం తిప్పుదామనుకున్నాడు. అయితే తాను అనుకున్న సమయం కంటే ముందే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో హడావిడిగా నల్గొండకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్యను ఓటర్ జాబితాలో చేర్చడానికి దరఖాస్తు చేసుకున్నాడు.
దురదృష్టవశాత్తు ఓటర్ జాబితాలో దరఖాస్తు చేసుకునే గడువు ముగిసిపోయింది. దీంతో ఓటర్ జాబితాలో శంకర్.. తన భార్య పేరు నమోదు చేయించలేకపోయాడు. సర్పంచ్ ఎన్నిక కోసం తొందరపడి పెళ్లి చేసుకుంటే.. అసలు పని కాకపోవడంతో తెగ బాధపడిపోతున్నాడట శంకర్. కానీ ఇప్పటికైనా అతడు ఓ ఇంటివాడయ్యాడని చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారట.
కాగా, రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఆదివారం (నవంబర్ 30) నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 2వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిచనున్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు గడువు ముగియడంతో.. నామినేషన్ల ఉపసంహరణ డిసెంబరు 3వ తేదీ వరకూ చేపట్టనున్నారు. డిసెంబరు 11న మొదటి విడతలో భాగంగా 4,236 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం డిసెంబరు 14న రెండో విడత, డిసెంబరు 17న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.