|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:07 PM
కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రాంతంగా.. ఉత్తర తెలంగాణ కోనసీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డిసెంబర్ 3వ తేదీన హుస్నాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్ సభా స్థలిని పరిశీలించి.. అధికారులకు ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.
హుస్నాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి..
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా.. హుస్నాబాద్ సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన పలు ముఖ్యమైన ప్రాజెక్టులను సీఎం ముందు ఉంచనున్నట్లు పేర్కొన్నారు. దీనిలో ముఖ్యంగా.. హుస్నాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రింగురోడ్డు నిర్మాణం, పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా తాగునీటి సౌకర్యం మెరుగుదలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని మంత్రి తెలిపారు. నియోజకవర్గ యువతను ప్రోత్సహించేందుకు స్టేడియం అభివృద్ధి , కబడ్డీ అకాడమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు.
పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం కోసం డిగ్రీ కాలేజీ సమీపంలోని స్థలంలో పార్క్‌ను, అలాగే మార్కెట్ యార్డ్, కాటన్ మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రిని కోరనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా కొన్ని సంక్షేమ పథకాల అమలును కూడా మంత్రి వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా సంఘాలకు ప్రత్యేకంగా బస్సులను పంపిణీ చేయనున్నారు.
ఇది మహిళల ఆర్థిక సాధికారతకు దోహదపడుతుంది. పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వారికి సైకిళ్లను పంపిణీ చేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి హుస్నాబాద్‌కు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఎక్స్‌ప్రెస్ బస్సుల సేవలను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.