|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 07:00 PM
మల్కాజ్‌గిరి సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్‌కు తమ కాలనీ పేరును పెట్టడంపై రాధాకృష్ణ నగర్ (ఆర్కే నగర్) కాలనీ ప్రజలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కాలనీ పేరునే రైల్వే స్టేషన్‌కు ఖరారు చేయడం తమకు గర్వకారణమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం కాలనీ సంక్షేమ సంఘం భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైల్వే మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు సాగడం.. అలాగే కాలనీ సభ్యుల సహకారంతోనే ఆర్కే నగర్ పేరు పెట్టడం సాధ్యమైందని వివరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి, ఇతర ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని పెంచడానికి అనేక రైల్వే స్టేషన్లు కృషి చేస్తున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి రద్దీ స్టేషన్లతో పాటు.. ఇటీవల రూ. 450 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చింది. వీటితో పాటు లింగంపల్లి, బేగంపేట, మల్కాజిగిరి స్టేషన్ల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
తాజాగా.. నగరంలో రెండు కొత్త రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టేషన్లు చర్లపల్లి - మౌలాలి - బొల్లారం మార్గంలో ఆర్కేనగర్ మరియు దయానంద్‌నగర్ వద్ద నిర్మిస్తున్నారు. ఈ రెండు స్టేషన్లలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులను ఇటీవల దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఆర్కేనగర్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఇక్కడ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం 21 కోచ్‌లకు సరిపడా ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తున్నారు. ఆర్కేనగర్ స్టేషన్‌లో అదనంగా ఆదిలాబాద్-తిరుపతి, విశాఖపట్నం-నాందేడ్, నర్సాపూర్-నాగర్‌సోల్, విశాఖపట్నం-షిర్డీ సాయినగర్, నాగావళి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లను కూడా ఆపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కొత్త రైల్వే స్టేషన్ల ప్రారంభం.. అదనపు రైళ్ల సౌకర్యాలు స్థానిక ప్రాంతాల ప్రయాణికులకు రవాణా సౌకర్యాన్ని, కనెక్టివిటీని గణనీయంగా పెంచే అవకాశం ఉంది.