|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 04:09 PM
భారత గ్రామాలకు పట్టుగొమ్మలు పంచాయతీ వ్యవస్థ అని నినాదం చేసినా, దాని పునాది స్వాతంత్ర్యం తర్వాతే పడింది. 1957లో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ మూడంచెల వ్యవస్థను సిఫారసు చేసింది – గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. తొలిసారిగా రాజస్థాన్‌లో 1959 అక్టోబర్ 2న అమలైంది. అదే ఏడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ గాంధీ జయంతి రోజున ప్రారంభమై, గ్రామీణ పాలనకు కొత్త అధ్యాయం తెరిచింది.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1964లో సమగ్ర గ్రామ పంచాయతీ చట్టం వచ్చింది. 500 పైబడిన జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చారు. అయితే 1964 నుంచి 1976 వరకు సర్పంచ్‌ను పరోక్షంగా ఎన్నుకునేవారు – వార్డు సభ్యులు ప్రజలు ఎన్నుకుంటే, వారిలో ఒకరిని సర్పంచ్‌గా ఎంచుకునేవారు. ఈ పద్ధతి పన్నెండేళ్లు కొనసాగి, గ్రామ నాయకత్వంలో పరోక్షత్వం ఆధిపత్యం చెలాయించింది.
1978లో నరసింహం కమిటీ సిఫారసుతో పెద్ద మలుపు తిరిగింది – సర్పంచ్‌ను నేరుగా ప్రజలు ఎన్నుకునే ప్రత్యక్ష విధానం వచ్చింది. తర్వాత 1987లో ఎన్టీఆర్ మండల వ్యవస్థ తెచ్చి తాలూకాలను రద్దు చేశారు. మండల అధ్యక్షులను కూడా ఓటర్లు నేరుగా ఎన్నుకునేలా చేశారు. ఈ మార్పు గ్రామీణ పాలనను మరింత ప్రజాస్వామ్యబద్ధం చేసింది.
1994 పంచాయతీరాజ్ చట్టం ద్వారా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి జరిగే విధానం స్థిరపడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత 2018లో కొత్త చట్టం తెచ్చి పంచాయతీలకు భారీ అధికారాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, ట్రాక్టర్లు, ఇంటింటా చెత్త సేకరణ వంటి సౌకర్యాలు తప్పనిసరి చేశారు. ఆరు దశాబ్దాలుగా పరిణమిస్తూ వస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడు మరోసారి ఎన్నికల సందడిలో మునిగింది!