|
|
by Suryaa Desk | Fri, Oct 31, 2025, 12:15 PM
గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న హైడ్రా DRF, GHMC సిబ్బందితో కలసి బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించింది. బుధవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తుండడంతో ఈ బండ రాయి కింద మట్టి కరిగి జారి పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. మల్కాజిగిరి గౌతమ్ నగర్ లో మల్లికార్జున నగర్లో ఈ ప్రమాదం జరిగింది. పైనుంచి బండరాయి పడడంతో కిందనే పార్కు చేసి ఉన్న చెత్త తరలించే GHMC ట్రాలీ నుజ్జయ్యింది. గతంలో యిక్కడ బండరాళ్లు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మే నెలలో కురిసిన వర్షాల సమయంలో కూడా బండ రాళ్ళు పడ్డాయి. చెత్త సేకరించిన వారు ప్రమాదకరంగా యిదే గుట్టపై తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుని వుండగా ప్రమాదాన్ని ముందే ఊహించిన హైడ్రా వాటిని ఈ ఏడాది జూలైలో ఖాళీ చేయించింది. లేని పక్షంలో పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు అలాగే ఇక్కడ ప్రతి శనివారం సంత కూడా జరుగుతుందని. స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పడిన బండ రాయిని GHMC తో కలిసి హైడ్రా DRF సిబ్బంది రాత్రి 9.30 గంటలకు తొలగించారు.