|
|
by Suryaa Desk | Tue, Oct 14, 2025, 05:06 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ఇదివరకే ప్రకటించాయి. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరఫున ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఒక చాయ్ దుకాణంలో వారు టీ అందించి ఓటర్లను ఆకర్షించారు. మల్లారెడ్డి ప్రచారం సందర్భంగా సందడి చేశారు. ఒక సెలూన్‌లో హెయిర్ కట్ చేస్తూ ఓటు అభ్యర్థించారు. మరోచోట పాపను ఎత్తుకుని డ్యాన్స్ చేశారు.కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బాకీ కార్డును కూడా మల్లారెడ్డి ఓటర్లకు అందించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఈ బాకీ కార్డును విడుదల చేసింది. "కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, మాగంటి సునీత నాయకత్వం వర్ధిల్లాలి" అంటూ నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం సాగించారు.