|
|
by Suryaa Desk | Thu, Sep 11, 2025, 01:44 PM
ఫిజియోథెరపిస్టులు తమ పేర్ల ముందు 'డాక్టర్' (Dr) టైటిల్ ను ఉపయోగించడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రోగులను, సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ, ఈ నిబంధనను కొత్త ఫిజియోథెరపీ కరికులం నుంచి వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన "కాంపిటెన్సీ బేస్డ్ కరికులం ఫర్ ఫిజియోథెరపీ, 2025"లో ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్లు తమ పేరు ముందు 'డాక్టర్' అని, చివర 'పీటీ' (PT) అని చేర్చుకోవచ్చని సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ (ఐఏపీఎంఆర్) సహా పలు వైద్య సంస్థలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే డీజీహెచ్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ విషయంపై డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా శర్మ మాట్లాడుతూ "ఫిజియోథెరపిస్టులు వైద్యులుగా శిక్షణ పొందరు. కాబట్టి వారు 'డాక్టర్' అనే పదాన్ని ఉపయోగించడం ప్రజలను, రోగులను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ఇది క్వాకరీకి (నకిలీ వైద్యం) దారితీసే ప్రమాదం ఉంది" అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. వైద్యుల సిఫార్సు మేరకే ఫిజియోథెరపిస్టులు పనిచేయాలని, వారు ప్రాథమిక ఆరోగ్య సంరక్షకులుగా వ్యవహరించకూడదని కూడా లేఖలో సూచించారు.