|
|
by Suryaa Desk | Fri, Jun 13, 2025, 05:08 PM
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 36 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈక్రమంలో హైదరాబాద్ కొత్త కలెక్టర్‌గా దాసరి హరిచందనను నియమించారు. ఇప్పటి వరకు భాగ్యనగరం కలెక్టర్‌గా విధులు నిర్వహించిన అనుదీప్ దురిశెట్టి.. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక హైదరాబాద్ కొత్త కలెక్టర్‌గా వస్తున్న దాసరి హరిచందనది కాస్త ఆసక్తికరమైన బ్యాగ్రౌండ్. ఆమె పుట్టింది, చదువుకుంది అంతా భాగ్యగనగరంలోనే. ఇక్కడే పుట్టి.. ఇప్పుడు ఇక్కడికే కలెక్టర్‌గా రావడం విశేషం.
హైదరాబాద్ కొత్త కలెక్టర్‌గా వస్తోన్న దాసరి హరిచందన ఇక్కడే పుట్టి పెరిగారు. డిగ్రీ కూడా భాగ్యనగరంలోనే పూర్తి చేశారు. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన హరిచందన.. లండన్‌లో పీజీ పూర్తయిన తర్వాత కొన్నాళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశారు. కానీ అది ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఈ క్రమంలో ఇండియాకు తిరిగి వచ్చి.. సివిల్స్‌కు చదివి సెలక్ట్ అయ్యారు. ముందు వైజాగ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా.. ఆతర్వాత విజయవాడ సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. 2014 తర్వాత తెలంగాణకు వచ్చారు.
ఆతర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో హరిచందన కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్‌గా, ఆయుష్ డిపార్ట్‌మెంట్ డైరక్టర్ వంటి కీలక బాధ్యతలు చేపట్టారు. అలానే జీహెచ్‌ఎంసీలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హరిచందన రోడ్లు, భవనాల విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తున్నారు.
ఇక విధినిర్వహణలో తనదైన ముద్ర వేశారు కలెక్టర్ హరిచందన . మహిళా సాధికారితపై ప్రధానంగా దృష్టి సారించారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు ప్రారంభించారు. అలానే ఆహారం వృథా కాకుండా.. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు గాను ఫీడ్ ది నీడ్ కమ్యూనిటీ రిఫ్రిజిరేటర్ల నెట్‌వర్క్‌ను ప్రారంబించారు. అలానే దుర్గం చెరువు బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ చేపట్టి.. దాన్ని ఎకో టూరిజంగా మార్చేందుకు హరిచందన ఎంతో కష్టపడ్డారు.
ఆరోగ్యం, గ్రామీణం, డిజిటల్ అక్షరాస్యత వంటి వివిధ రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను నాలుగేళ్ల క్రితం అనగా 2021లో బ్రిటీష్ కౌన్సిల్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయ ఐఏఎస్ అధికారి హరిచందనే కావడం విశేషం. ఇక పుట్టి పెరిగిన జిల్లాకే కలెక్టర్‌గా వస్తోన్న హరిచందనకు అభినందనలు తెలుపుతున్నారు.