|
|
by Suryaa Desk | Sun, May 18, 2025, 01:09 PM
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని నేరడిగొండలో పెళ్లింట ఆనందం కన్నీళ్ల తడిగా మారింది. వరుడిని తీసుకువస్తున్న ఓ వ్యాన్ ఘోర రోడ్డుప్రమాదానికి గురై బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, నేరడిగొండ (జీ) గ్రామానికి చెందిన యువతికి జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన యువకుడితో వివాహం మే 22న జరగాల్సి ఉంది. వివాహం సందర్భంగా వరుడిని తీసుకురావడానికి బంధువులు, స్నేహితులు కలిసి వ్యాన్లో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.
దీంతో వాహనంలో ఉన్నవారిలో చాలామందికి గాయాలు కాగా, తీవ్రంగా గాయపడిన నలుగురిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పెళ్లి వేడుకకు సిద్ధమైన ఇరు కుటుంబాల్లోనూ ఈ ప్రమాదంతో తీవ్ర విషాదం అలముకుంది. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.