రైతుల సమస్యలపై దృష్టి మళ్లించేందుకే తుమ్మిడిహట్టి ప్రకటనలు : బాల్క సుమన్ తుమ్మిడిహట్టి డీపీఆర్ బయటపెట్టాలి
సూర్య బ్యూరో ప్రతినిధి : రాష్ట్రంలో రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ప్రకటనలతో ప్రజల దృష్టిని మళ్లిస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు డీపీఆర్‌ను బయటపెట్టి, ఎంత ఖర్చుతో ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. వరి విత్తనాల విక్రయాలపై డీలర్లకు నోటీసులు ఇవ్వడం, రైతుల నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రాలు కోరడం సరికాదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి ఉంటే రైతులకు నీరందేదని పేర్కొన్నారు.కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై కాంగ్రెస్, బీజేపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీతారామ, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా ఎంత నీటిని ఎత్తిపోశారో వివరాలు వెల్లడించాలని కోరారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో కే. కిషోర్ గౌడ్, గెల్లు శ్రీనివాస యాదవ్, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.