రైతు మేళా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా
దుద్యాల, మేజర్ న్యూస్:నవంబర్ 7, 8, 9 తేదీల్లో దుద్యాల మండలం హకీంపేట శివారులో నిర్వహించనున్న రైతు మేళాను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. రైతు మేళా నిర్వహణకు సంబంధించి శనివారం జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు మేళాకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని పోలీసు అధికారులకు సూచించారు. రైతు మేళా ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు అమర్చాలని, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం, రైతులకు ఏర్పాటు చేయనున్న వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, తాండూరు ఆర్డీవో అనిత, జిల్లా వ్యవసాయ అధికారి కవిత, తహసీల్దార్ కిషన్ నాయక్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.