రావల్ కోల్‌లో ఓవర్‌లోడ్ వాహనాల బీభత్సం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం
మేడ్చల్, మేజర్ న్యూస్:ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్ గ్రామంలో క్రషర్ల నుంచి నిత్యం అధిక లోడుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా గ్రామ రహదారులపై దూసుకెళ్తున్న ఓవర్‌లోడ్ వాహనాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి.భారీ వాహనాల రాకపోకలతో గ్రామ రహదారులపై దుమ్ము, ధూళి విపరీతంగా వ్యాపిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. గతంలో పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.క్రషర్ యజమానులు, వాహన యజమానులు ప్రజల భద్రతను విస్మరించి రవాణా, వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఓవర్‌లోడ్ వాహనాలపై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు పర్యవేక్షణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే అధికారులు మేల్కొని ఓవర్‌లోడ్ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే క్రషర్, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి రావల్ కోల్ ప్రజలకు రహదారి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.