ఉద్యోగ భద్రత కల్పించాలని ముగ్గులు వేసి నిరసన -- ఎన్.హెచ్.ఏం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
*నారాయణపేట, సూర్యన్యూస్:* తెలంగాణ రాష్ట్రంలోని జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం టీజీ ఎన్.హెచ్.ఏం జేఏసి
ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె నారాయణపేట జిల్లాలో గురువారంతో మూడవ రోజుకు చేరుకుంది. జిల్లా కేంద్రంలోని వివేకానంద పార్క్ వద్ద జిల్లాలోని ఎన్.హెచ్.ఏం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా మహిళ నాయకులు తమ డిమాండ్లను ముగ్గుల రూపంలో వేసి నిరసన వ్యక్తం చేశారు. వైద్యుల నుంచి కాంటింజెంట్ వర్కర్ల వరకు వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఐక్యంగా సమ్మెలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దశాబ్దాలుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎన్.హెచ్.ఏం ఉద్యోగులను ప్రభుత్వం ఎప్పుడు రెగ్యులరైజ్ చేస్తుంది, సమాన పనికి సమాన వేతనం ఎప్పుడు అమలు చేస్తుంది, ఉద్యోగ, ఆరోగ్య భద్రత ఎప్పుడు కల్పిస్తుంది అంటూ ఉద్యోగులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల జీవితాల్లో మాత్రం ఆశించిన మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులు నేటికీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాల్లో అభద్రత మధ్య పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి సంవత్సరం 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు తగిన ఆరోగ్య భద్రత కల్పించాలన్నారు.
*ఎన్.హెచ్.ఏం నిరసనలకు బిజెపి మద్దతు...*
బీజేపీ పార్టీ తరపున మద్దతు ప్రకటించిన బిజెపి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ మాట్లాడుతూ
ఉద్యోగులకు ఆరోగ్య భద్రతతో పాటు తగిన రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్.హెచ్.ఏం ఉద్యోగులకు అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలోనూ వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించి స్పష్టతనిస్తూ, ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబాలను పోషించేందుకు తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్.హెచ్.ఏం ఉద్యోగుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి రాఘవేందర్, ఎన్.హెచ్.ఎం యూనియన్ సభ్యులు డాక్టర్ నరసింహ రావు సగరి, మోనేష్ చారి, శ్రీలత, వెంటరమణ, అనురాధ, తిరుపతి, కిరీటి, శ్వేతశ్రీ, విరోజ, చందన, పుష్ప, సరస్వతి, డీడీఎం స్నేహలత, డిఏఏం మమత తదితరులు పాల్గొన్నారు.
*-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*