సమాచార హక్కు దరఖాస్తులకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి
సమాచార హక్కు దరఖాస్తులకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలి
పారదర్శకత, జవాబుదారీతనంతో అధికారులు విధులు నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్
సిద్దిపేట అర్బన్ :సమాచార హక్కు చట్టం–2005 ద్వారా అర్జీదారులు కోరిన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా అందించాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ అధికారులకు సూచించారు. సమాచార హక్కు చట్టం అమలులో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ప్రభుత్వ పాలనపై విశ్వాసం కలిగించేలా పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.శుక్రవారం సిద్దిపేటలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన సమాచార హక్కు చట్టం వారోత్సవాలు–2026 కార్యక్రమానికి ఆమె విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వారోత్సవాల కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ప్రధాన న్యాయమూర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు.అనంతరం అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులకు కల్పించిన హక్కులపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రజా సమాచార అధికారులు అర్జీదారులు కోరిన సమాచారాన్ని చట్ట నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా అందించాలని స్పష్టం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజకుమార్, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రజా సమాచార అధికారులు పాల్గొన్నారు.