నిమజ్జనాల్లో విషాదం
వివిధ ఘటనల్లో 13 మంది మృతి
హైదరాబాద్, సూర్య ప్రతినిధి:వినాయక నిమజ్జనోత్సవాలు విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో ఎస్సై సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు. ఈ వివరాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా పబ్లిక్ ప్లేసుల్లో 1.24 లక్షల వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు ఇళ్లలో, గేటెడ్ కమ్యూనిటీల్లో, అపార్ట్‌మెంట్లలో పెద్ద సంఖ్యలో విగ్రహాలను ఏర్పాటు చేశారని, వాటిని కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు డీజీపీ పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో 13 మంది మృతి చెందగా, 26 మంది గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఎస్సై ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. నిమజ్జనోత్సవాల సందర్భంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు నిమజ్జన ప్రాంతాలకు తరలిరావడంతో కొన్ని చోట్ల అనుకోని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నిమజ్జన సమయంలో ప్రజలు జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.