క్షయరహిత గ్రామంగా ఖైతాపురం
‘టిబీ ముక్త్ భారత్’లో ఉత్తమ గ్రామంగా ఎంపిక*
సమిష్టి కృషికి దక్కిన అరుదైన గుర్తింపు
చౌటుప్పల్, మేజర్ న్యూస్: క్షయ వ్యాధి నిర్మూలనలో ఖైతాపురం గ్రామం అరుదైన ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘టిబీ ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘క్షయ వ్యాధి లేని ఉత్తమ గ్రామం’గా ఖైతాపురం ఎంపికైంది. గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణకు పంచాయతీ, ప్రజాప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది చేసిన సమిష్టి కృషికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.గ్రామ సర్పంచ్ యెల్మా రామలింగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం, అనుమానితులను గుర్తించి పరీక్షలు చేయించడం, చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సహకారం అందించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ప్రజాప్రతినిధులు గ్రామస్థులతో సమన్వయంతో పనిచేశారు. ఈ కృషి ఫలితంగానే ఖైతాపురానికి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు దక్కింది.
నేడు అవార్డు ప్రదానం
ఈ నెల 8న యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఖైతాపురం సర్పంచ్ యెల్మా రామలింగేశ్వర్‌రెడ్డి, కార్యదర్శి, ప్రజాప్రతినిధులకు ఉత్తమ గ్రామ అవార్డు సర్టిఫికెట్‌ను అందజేయనున్నారు. ఈ సందర్భంగా వారిని సన్మానించనున్నారు.