తాగునీటి వృథాపై జలమండలి సీరియస్.. ఆకస్మిక తనిఖీలు, కఠిన చర్యలు!
సూర్య తెలంగాణ డెస్క్: నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు జలమండలి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎల్-నినో ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితుల కారణంగా మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్న నేపథ్యంలో, ప్రతి చుక్కను రక్షించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రాకపోవడం, నల్లాలు తెరిచి ఉంచడం, ఫ్లోర్లు మరియు వాహనాలను తాగునీటితో కడగడం వంటి ఘటనలు కొనసాగుతుండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సోమవారం ఉదయం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నిబంధనలు ఉల్లఘించి నీటిని వృథా చేస్తున్న ఐదుగురు వినియోగదారులను గుర్తించి వారికి తక్షణమే జరిమానాలు విధించారు.
ఇకపై నగరవ్యాప్తంగా తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని, నీటి సరఫరా సమయాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొదటిసారి నీటిని వృథా చేస్తూ పట్టుబడిన వారికి జరిమానా విధిస్తుండగా, అదే వ్యక్తి లేదా వినియోగదారుడు రెండోసారి కూడా ఉల్లంఘనకు పాల్పడితే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నేరుగా నీటి కనెక్షన్‌ను శాశ్వతంగా తొలగించేందుకు సిద్ధమయ్యామని జలమండలి స్పష్టం చేసింది. కేవలం ప్రజల మీదే కాకుండా జలమండలి అంతర్గత వ్యవస్థలోనూ నీటి వృథాకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. నగరవ్యాప్తంగా విస్తరించి ఉన్న వేల కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్‌వర్క్‌లో ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే గుర్తించి, గరిష్టంగా ఇరవై నాలుగు గంటల్లోగా యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు.
ప్రజలకు నీటి విలువ గురించి చెబుతున్న జలమండలి, తన వ్యవస్థలోనూ ఒక్క చుక్క నీరు వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. పైప్‌లైన్ లీకేజీల విషయూలంలో సిబ్బంది లేదా అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ రోజు మనం నిర్లక్ష్యంగా వృథా చేసే ప్రతి నీటి చుక్క రేపు మరొకరి ప్రాణాధారమైన తాగునీటి అవసరానికి ఉపయోగపడుతుందని, జరిమానాలు విధించడం తమ లక్ష్యం కాదని, కేవలం నీటి వృథాను పూర్తిగా అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. నగరానికి జీవనాధారమైన తాగునీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, నీటిని పొదుపుగా వాడాలని జలమండలి విజ్ఞప్తి చేసింది.