గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గుజ్జ సత్యంకు అవకాశం కల్పించాలి
సోమాజిగూడ / మేజర్ న్యూస్ :4 బీసీ ఉద్యమ నాయకుడు, చేనేత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యంకు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని సోమాజిగూడలో నిర్వహించిన బీసీ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీసీల హక్కుల సాధన, చేనేత కార్మికుల సంక్షేమం, విద్యా, వైద్య, కార్మిక, మీడియా రంగాల్లో ఆయన చేస్తున్న సేవలను గుర్తించాలని వివిధ బీసీ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, సమాజానికి విశేష సేవలు అందించిన వ్యక్తులకు అవకాశం కల్పించే విధంగా వినియోగించాలని సూచించారు. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, కులగణనలో తగిన గుర్తింపు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల పరిష్కారం, ప్రత్యేక సంక్షేమ నిధుల సాధన వంటి అంశాలపై గుజ్జ సత్యం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన ఆయన చేనేత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక, మార్కెటింగ్ సమస్యలపై ప్రత్యక్ష అవగాహన కలిగి ఉన్నారని తెలిపారు. ఉప్పల్‌లోని పద్మశాలి హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్ మార్కెట్ నిర్వహణతో పాటు విద్యా సంస్థలు, వైద్య సేవలు, మీడియా రంగాల్లోనూ బాధ్యతలు నిర్వహిస్తున్నారని వివరించారు. గతంలో INTUC రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కార్మికుల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
రాజకీయ పదవుల కంటే సామాజిక సేవకు ప్రాధాన్యం ఇచ్చి, బీసీలు, చేనేత కార్మికులు, విద్యార్థులు, వెనుకబడిన వర్గాల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించే అవకాశం గుజ్జ సత్యంకు కల్పించాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం వర్తించే అర్హతలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వీహెచ్ హనుమంతరావు, రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వీజీఆర్ నారగోని, మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింగ్ రావు, కర్నాటి ధనంజయ, మట్ట జయంతి గౌడ్, బొమ్మ రఘురాం, రాములు యాదవ్, సూర్యనారాయణ, పండరి నాథ్ తదితరులు పాల్గొన్నారు. పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కూడా హాజరయ్యారు.