ఏడాదిలో జయమ్మ రిజర్వాయర్ పూర్తి చేస్తాం -- మళ్ళీ దసరాకు నారాయణపేట ప్రాంతం సస్యశ్యామలం -- సాగు, తాగునీటికి ఇబ్బందులు దూరం -- చిట్టెం నర్సిరెడ్డికి ఈ ప్రాజెక్టు అంకితం -- భూములు కోల్పోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తాం -- మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి
*నారాయణపేట, సూర్యన్యూస్:* గత పాలకుల నిర్లక్ష్యంతో పక్కనే ఉన్న కృష్ణమ్మ నీటిని అందించలేక ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే మక్తల్ – నారాయణపేట – కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు. ఏడాదిలోపు పేరపల్ల జయమ్మ చెరువును రిజర్వాయర్ గా మార్చి వచ్చే దసరాకి నారాయణపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మక్తల్ – నారాయణపేట – కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నారాయణపేట మండలం పెరపల్ల గ్రామంలోని జయమ్మ చెరువులో జయమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులకు గురువారం నారాయణపేట జిల్లా మాజీ డిసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి సమక్షంలో జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శ్రీను, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ సత్యనారాయణలు రైతులతో కలసి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో రైతులను ఉద్దేశించి మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, జయమ్మ రిజర్వాయర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమని, ఎన్నో ఏళ్ల పోరాటం, రైతుల త్యాగాల ఫలితంగా ఈ రోజు నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయని అన్నారు.
*నాలుగు దశాబ్దాల పోరాటానికి ఫలితం...*
జయమ్మ చెరువు ను రిజర్వాయర్ గా మార్చాడానికి కోసం ఎన్నో కష్టాలు, అవమానాలు, ఆటంకాలను ఎదుర్కొంటూ పోరాటం సాగించామని కుంభం శివకుమార్ రెడ్డి తెలిపారు.ఆరోజు అధికారంలో ఉన్న కొందరు అవగాహన లేకుండా జయమ్మ చెరువు గురించి మాట్లాడారని,అభివృద్ధి చేయడం చేతకాక, రాజకీయాలు చేశారని ఆరోజే ఒక్క అవకాశం వస్తే ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చి ఎలా అభివృద్ధి చేయాలో చేసి చూపిస్తామని ఆరోజు చెప్పిన మాట ప్రకారం ఈరోజు ప్రాజెక్టు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామన్నారు.రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా పట్టించుకోకుండా ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.పేర్కొన్నారు. దివంగత నార్సిరెడ్డి గారి ఆశయ సాధనకు ఈ ప్రాజెక్టును అంకితం చేస్తున్నానని భావోద్వేగంతో ప్రకటించారు.
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.*
మక్తల్-నారాయణపేట-కొడంగల్ సాగునీటి ప్రాజెక్టు మంజూరు లో మరియు వేగవంతంగా నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం అందించారని పేర్కొంటూ, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు, నిర్వాసిత రైతులకు ఎకరాకు 20 లక్షల పరిహారం పెంపు వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
*భూములు కోల్పోయిన రైతుల త్యాగాలను గౌరవిస్తాం...*
రిజర్వాయర్ కోసం భూములు అందించిన రైతుల త్యాగాలను మరువమని, వారిని గౌరవిస్తామని కుంభం శివకుమార్ రెడ్డి అన్నారు.ప్రతి రైతుకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. రైతుల భూముల్లో ఉన్న బావులు,బోర్లు, చెట్లు, షెడ్లు తదితర ఆస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కటి నమోదు చేయాలని అధికారులను కోరారు. పరిహారం విషయంలో ఏ రైతుకూ అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు.భూములు కోల్పోయిన కుటుంబాలు తమ జీవనాధారాన్ని కోల్పోయి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రైతులు తనపై, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటమని ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం విద్యా, వైద్య రంగాలకు వందల కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపడుతున్నామని, తమ చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తామని హామీ ఇచ్చారు.
*రైతుల సహకారంతో ప్రాజెక్టు విజయవంతం కావాలి.*
ప్రాజెక్టు నిర్మాణానికి భూములు అందించిన రైతులకు, గ్రామ సర్పంచ్ అంజనేయులుకు, ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖల అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కుంభం శివకుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జయమ్మ రిజర్వాయర్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయి, నారాయణపేట ప్రాంతం సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవిన్యూ అధికారులు,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
*రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట*