చిన్నజట్రంలో టీబీ స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం
నారాయణపేట, సూర్య న్యూస్: నారాయణపేట మండలం చిన్నజట్రం గ్రామంలో గురువారం టీబీ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. కోటకొండ ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ విరోజ హాజరై రోగులకు పరీక్షలు నిర్వహించి ఫుడ్ బిస్కెట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విరోజ మాట్లాడుతూ.. టీబీని ముందుగానే గుర్తించి పూర్తి చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చని, ప్రజలు టీబీ లక్షణాలు కనిపించినప్పుడు సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు టీబీ రోగులు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని సూచించారు. క్యాంపుకు హాజరైన గ్రామ ప్రజలకు టీబీ వ్యాధి నిర్ధారణకు ఎక్సరే పరీక్షలు నిర్వహించారు. టీబీ లక్షణాలు, వ్యాధి నివారణ, చికిత్సపై అవగాహన కల్పించారు. ఇప్పటికే టీబీ చికిత్స పొందుతున్న రోగులకు పోషకాహారం అందించేందుకు ఫుడ్ బిస్కెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, పంచాయితీ సెక్రెటరీ సుజాత, టీబి సూపర్వైజర్ శ్రీధర్, ఏఎన్ఎం రేణుక, ఆశా వర్కర్లు సావిత్రమ్మ, నాగమణి, విజయలక్ష్మి, అనిత, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.