telanagana
బై బై గణేశా..!
వికారాబాద్‌లో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం
ఆకట్టుకున్న గణనాథుల శోభాయాత్ర..
పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25): వికారాబాద్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాలను అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. వివిధ మండపాల నుంచి ప్రారంభమైన వినాయకుల శోభాయాత్రలు ప్రధాన వీధుల మీదుగా సాగడంతో పట్టణం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘గణపతి బప్పా మోరియా.. బై బై గణేశా’ అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
*మండపాలను సందర్శించిన స్పీకర్
వినాయక నిమజ్జనానికి ముందు తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పట్టణంలోని వివిధ వినాయక మండపాలను సందర్శించారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వికారాబాద్‌తో పాటు తెలంగాణ ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. వినాయక చవితి చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రజలందరినీ ఒకచోట చేర్చే గొప్ప పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించినట్లే నిమజ్జన సమయంలోనూ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గణనాథుడిని ప్రార్థించారు.ఆయన వెంట రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యుడు కె. రంగరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీకాంత్ రెడ్డి, హిరేకర్ రాకేష్, వినోద్ కుమార్, మురళి, సుధాకర్, రామకృష్ణారెడ్డి, రాఘవేందర్, డి. మల్లికార్జున్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం సేటు, మార్కెట్ కమిటీ చైర్మన్ చాపల శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేశం, మాజీ ఏఎంసీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ ముత్తాహర్ షరీఫ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాములు, కాకి నాగరాజు, శ్రీకాంత్, బాదం అశోక్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*ఆకట్టుకున్న శోభాయాత్ర
పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాలపై పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి శోభాయాత్రగా తరలించారు. యువత డప్పులు, బ్యాండ్ మేళాలు, డీజేలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో గణనాథుల ఊరేగింపును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
*పోలీసుల భారీ బందోబస్తు
నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే మార్గాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు.వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, వికారాబాద్ టౌన్ సిఐ రఘు కుమార్,ఇతర పోలీస్అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
*ఘనంగా వీడ్కోలు
నిమజ్జనం సందర్భంగా భక్తులు ‘గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రావయ్యా’ అంటూ నినాదాలు చేస్తూ గణనాథుడికి భావోద్వేగంతో వీడ్కోలు పలికారు. భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. తొమ్మిది రోజులుగా పట్టణంలో కొనసాగిన వినాయక ఉత్సవాలకు నిమజ్జనంతో ఘనంగా ముగింపు పలికారు.