telanagana
అత్యంత పారదర్శకంగా అంగన్వాడీ టీచర్ నియామక ఇంటర్వ్యూలు - జిల్లా కలెక్టర్ రాజర్షిషా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి: గాదిగూడ మండలంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ల నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో మంద మకరందుతో కలిసి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్నారుల సంక్షేమాన్ని బలోపేతం చేయడంలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అర్హులైన ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నియామక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టినట్లు తెలిపారు.అంగన్వాడీ టీచర్ పోస్టుల నియామకానికి సంబంధించి మొత్తం 283 దరఖాస్తులు అందగా, అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి 47 మంది అభ్యర్థులను అర్హులుగా, 236 దరఖాస్తులను అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అర్హత సాధించిన 47 మందిలో 46 మంది ఇంటర్వ్యూకు హాజరుకాగా, ఒకరు గైర్హాజరైనట్లు వివరించారు.నియామక ప్రక్రియలో పూర్తిగా మెరిట్, నిబంధనలకు ప్రాధాన్యత ఇస్తూ పారదర్శకంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాధన, గిరిజన సంక్షేమ శాఖ డీడీ అశోక్, ఇతర సంబంధిత శాఖల అధికారులు, అభ్యర్థులు, సిబ్బంది పాల్గొన్నారు.