telanagana
పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి;కామారెడ్డి జిల్లా లో పత్తి కొనుగోళ్లను సజావుగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పత్తి కొనుగోళ్లపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియ తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సీజన్‌లో పత్తికి క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పత్తిలో తేమ శాతం, నాణ్యత, రకాన్ని బట్టి ధరలో మార్పులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు పత్తిని ఇంటి వద్దనే బాగా ఆరబెట్టి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.రైతులకు పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-5779ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చని తెలిపారు. అలాగే సీసీఐ వాట్సాప్ చాట్‌బాట్ నంబర్ 88972-81111 ద్వారా సీసీఐ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సేవలు, సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు.గత సంవత్సరం మాదిరిగానే కపాస్ కిసాన్ యాప్ ద్వారా జిల్లాలోని మద్నూర్‌లో ఉన్న 7 జిన్నింగ్ మిల్లులు, గాంధారిలోని 1 జిన్నింగ్ మిల్లులో పత్తిని విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని 67 రైతు వేదికల్లో 67 తేమ కొలిచే పరికరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకురావడానికి ముందే రైతు వేదికల వద్ద తేమ శాతాన్ని పరీక్షించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.పత్తి కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, జిల్లా వ్యవసాయ అధికారి విజయభారతి, అటవీ శాఖ అధికారులు సంధాన, విజయ్, మద్నూర్, గాంధారి మార్కెట్ కమిటీ కార్యదర్శులు, డీఎస్పీ, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, ఎఫ్‌పీవోల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.