అక్రమ మట్టి తవ్వకాలను ఉపేక్షించేది లేదు....
అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు
ఇబ్రహీంపట్నం ఏసీపీ కె పి వి రాజు
అక్రమ మట్టి తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.పి.వి. రాజు స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపట్టి తరలించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగడంతో పాటు పర్యావరణానికి, భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.మంగళవారం మంచాల పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐలు వంశీ, నాగేశ్వర్‌రావులతో కలిసి ఏసీపీ కె.పి.వి. రాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు చేపట్టడం, అక్రమంగా మట్టిని తరలించడం చట్టరీత్యా నేరమన్నారు. కొందరు నిబంధనలను పట్టించుకోకుండా రాత్రి వేళల్లో యంత్రాలతో మట్టి తవ్వకాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపునకు సంబంధించి ఎవరికైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులు, సంబంధిత శాఖల నిబంధనలను పాటించకుండా మట్టి తవ్వకాలు చేపడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండల పరిధిలో అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారని ఏసీపీ తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల