ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
మారుతున్న ఆహారపు అలవాట్లతో పెరుగుతున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ఆయుర్వేద వైద్యం ఎంతగానో దోహదపడుతుందని పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పవిత్ర అన్నారు. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం, 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పెద్దపల్లి ఆయుర్వేద హోమియో వైద్యశాల వద్ద ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర, పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ పవిత్ర మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, కల్తీ ఆహార పదార్థాల వినియోగం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆయుర్వేద వైద్య విధానం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘ప్రజల కోసం.. విశ్వం కోసం ఆయుర్వేదం’ అనే లక్ష్యంతో పెద్దపల్లిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు.
పట్టణ ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని, వైద్యుల సూచనలు పొందుతూ తమ ఆరోగ్య సమస్యలకు తగిన వైద్య సేవలు పొందాలని డాక్టర్ పవిత్ర సూచించారు.