ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల రథయాత్రను విజయవంతం చేయాలి-రెడ్డి జేఏసీ నాయకులు
సూర్య - మానకొండూర్ : ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలో ఈనెల 24, 25, 26 తేదీల్లో జరగనున్న సామాజిక వేత్త ప్రవీణ్ అరోర రథయాత్రను విజయవంతం చేయాలని రెడ్డి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మానకొండూరు మండలం కొండపల్కల గ్రామంలో రథయాత్రకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో కులంతో సంబంధం లేకుండా కేవలం ఆర్థిక వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకుని రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల్లోని పేదలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే సామాజిక వేత్త ప్రవీణ్ అరోర ఈ రథయాత్రను చేపడుతున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర ద్వారా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ల ఆవశ్యకతపై విస్తృత అవగాహన కల్పిస్తారని చెప్పారు. సామాజిక సమానత్వం కోసం జరిగే ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలు, సామాజిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి జేఏసీ అధ్యక్షుడు ఏనుగు చోక్కారెడ్డి, కొండపల్కల గ్రామ రెడ్డి సంఘం అధ్యక్షుడు కంది వీరారెడ్డి, మానకొండూరు రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల రెడ్డి సంఘం కోశాధికారి కోమల్ రెడ్డి, కరీంనగర్ రెడ్డి సంఘం నాయకులు డాక్టర్ అరుకాల సంజీవరెడ్డి, రెడ్డి నాయకులు లంబు రాజేందర్ రెడ్డితో పాటు పలువురు సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.