ఇరాన్‌పై గెలుపు.. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న భారత మహిళల కబడ్డీ జట్టు!
సూర్య స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు సంచలన ప్రదర్శనతో పసిడి పతకాన్ని ముద్దాడింది. శనివారం తోకై సిటిజన్ జిమ్నాసియంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 37-34 తేడాతో బలమైన ఇరాన్ జట్టును చిత్తు చేసింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత మహిళల కబడ్డీ జట్టుకు ఇది నాలుగో స్వర్ణ పతకం కాగా, ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం.
ముగిసిన తొలిసగం ముగిసేసరికి భారత్ 22-16 ఆధిపత్యంలో నిలిచింది. మ్యాచ్ ప్రారంభంలో ఇరు జట్లు 5-5 పాయింట్లతో సమానంగా నిలవగా, ఇరాన్ ఒక దశలో 6-5తో ఆధిక్యం సాధించింది. అయితే పూజ, భావనా దేవి, నికితల అద్భుత రైడింగ్, టాకిళ్లతో భారత్ పుంజుకుని ప్రత్యర్థిని ఆల్‌అవుట్ చేసి 13-10తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సంజు దేవి సూపర్ రైడ్‌తో విరుచుకుపడటంతో ప్రథమార్ధం ముగిసేసరికి భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.
రెండో సగంలో ఇరాన్ క్రీడాకారిణులు తీవ్రంగా శ్రమించి పునరాగమనం చేశారు. జెహ్రా కరీమి టాకిళ్లతో పాయింట్లు సాధించడమే కాకుండా భారత్‌ను ఆల్‌అవుట్ చేసి స్కోరును 27-26కి తగ్గించారు. అయినప్పటికీ ఒత్తిడిని అధిగమించిన భారత ప్లేయర్లు నిలకడగా పాయింట్లు సాధించారు. సంజు రెండు పాయింట్ల రైడ్‌తో భారత్‌ను మళ్లీ 34-28తో ఆధిక్యంలోకి తీసుకెళ్లగా, పూజ కీలక పాయింట్ రాబట్టి జట్టుకు 37-34 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని ఖరారు చేసింది.