యూపీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెంపునకు డీలిమిటేషన్ కసరత్తు
సూర్య జాతీయ డెస్క్: ప్రతిపాదిత డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026తో కూడిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 ద్వారా ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఆ రాష్ట్ర ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం వెల్లడించారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు, డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ చట్టాలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన మరుసటి రోజే ఆయన ఈ ప్రకటన చేశారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచడం, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మంత్రివర్గ నిర్ణయం ఒక కీలక ముందడుగు అని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రాష్ట్ర శాసనసభల గరిష్ట సభ్యుల సంఖ్యను 500 నుంచి దాదాపు 650 స్థానాలకు పెంచేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(1) సవరణ ప్రతిపాదన కూడా ఇందులో ఉందని హోంమంత్రి తెలిపారు. ఈ నిబంధన వల్ల అవిభాజ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం పెరిగేందుకు మార్గం సుగమమవుతుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు అమలు కావడం వల్ల ఉత్తరప్రదేశ్ మహిళలకు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అత్యధిక ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడం వల్ల శాసనసభలో స్థానిక సమస్యలు, ప్రాధాన్యతలను మరింత సమర్థవంతంగా వినిపించగలుగుతారని అమిత్ షా వివరించారు. దీనివల్ల స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి వీలు కలుగుతుందని, సమగ్ర అభివృద్ధి వేగవంతమవుతుందని అభిప్రాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో సుపరిపాలన, ప్రజా భాగస్వామ్యాన్ని ఈ నిర్ణయం మరింత బలోపేతం చేస్తుందని పేర్కొంటూ, ఈ చారిత్రక బిల్లుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.