భక్తులకు వాటర్ బాటిళ్ల పంపిణీ..
సూర్య - పెద్దపల్లి రూరల్ :
మండలంలోని దేవునిపల్లి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. జాతరకు పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.జాతరకు విచ్చేసిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు బీసీ నాయకులు కొలిపాక శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచితంగా 50 వేల వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.వేలాది మంది భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడం పట్ల స్థానికులు,భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం కొలిపాక శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం ఆనందంగా ఉందని,భక్తులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో పెద్దపల్లి గడ్డపై బీసీ ఎమ్మెల్యే జెండా ఎగరడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బీసీలందరూ కులాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి ఐక్యతను చాటాలని, కలిసికట్టుగా ముందుకు సాగినప్పుడే రాజకీయంగా బలపడగలమని పిలుపునిచ్చారు.
జాతర సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ ముదిరాజ్, పెద్దపల్లి జిల్లా మత్స్యశాఖ చైర్మన్ కొలిపాక నరసయ్య,18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సంపత్,33వ వార్డు కౌన్సిలర్ గంగుల సంధ్యారాణి,సతీష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శంకర్, అధికారులు వీరిని శాలువాలతో ఘనంగా సన్మానించగా,వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో భూతగడ్డ తిరుపతి,మౌటం శంకర్,ఆశాలు,వేల్పుల కనకయ్య,గంగుల సంతోష్,కొలిపాక రాము,లక్ష్మణ్, కుక్క అశోక్, శ్రావణ్,నూనె వెంకటేష్,నవీన్,ఆది రాజు,నరేష్,మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.