కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష!
దుబ్బాక;కేసీఆర్ చేపట్టిన చారిత్రక ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక మలుపు అని ఆ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం, తెలంగాణ ఏర్పాటులో చేసిన జాప్యం కారణంగానే ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లుల కడుపుకోతకు కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు.దీక్షా దివస్ సందర్భంగా ఆదివారం ఆయన ఆధ్వర్యంలో దుబ్బాకలో పలు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అక్బర్పేట చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు.దుబ్బాకలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ కార్యాలయంలో అమరులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిందని, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా అనేక పోరాటాలు చేసి, చివరకు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, యావత్ తెలంగాణ సమాజం ఒక్కటై ఉద్యమించిందని అన్నారు. ఆ చారిత్రక దీక్ష ఫలితంగానే కేసీఆర్ అరెస్టుతో ఉద్యమం మరింత ఉధృతమై ఇంటింటికీ చేరిందని గుర్తుచేశారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించి, 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 2001లో జలదృశ్యంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సమయంలో తాను కూడా అక్కడికి వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందా? కేసీఆర్ సాధిస్తాడా? అని కొందరు అనుమానంతో వెనుదిరిగిన సందర్భాలను ప్రస్తావించారు. సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా పోలీసులు తనను వెంబడించిన ఘటనతో పాటు, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవాలను పంచుకున్నారు.కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లపాటు తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాయకులు, కార్యకర్తలు అధైర్యపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, బి ఆర్ ఎస్ పట్టణ, మండలాల అధ్యక్షులు అధ్యక్షుడు ఇల్లెందుల శ్రీనివాస్, బాణాల శ్రీనివాస్, జీడిపల్లి రవి, జీడిపల్లి రాంరెడ్డి, తోట అంజిరెడ్డి, రహీం, మున్సిపల్ చైర్పర్సన్ సంగీత రవీందర్, సీనియర్ నాయకులు వెంకట నరసింహారెడ్డి, సోలిపేట సతీష్ రెడ్డి, గుండెల్లి ఎల్లారెడ్డి, కడతాల రవీందర్ రెడ్డి, కొత్త కిషన్ రెడ్డి, ఆస యాదగిరి, రణం శ్రీనివాస్ గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్,తో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.