కేరళలోని ఆరు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరిక
సూర్య అంతర్జాతీయ డెస్క్: కేరళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు ఐఎమ్‌డీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం, ఇడుక్కి మరియు త్రిసూర్ జిల్లాల్లో అక్కడక్కడ కుండపోత వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తిరువనంతపురంలోని వాతావరణ కేంద్రం ప్రతినిధులు వెల్లడించారు.
సెప్టెంబర్ 21 నుండి 25 వరకు కేరళతో పాటు లక్షద్వీప్ ప్రాంతాల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. సాధారణంగా 24 గంటల వ్యవధిలో 64.5 మిమీ నుండి 115.5 మిమీ వరకు కురిసే వర్షపాతాన్ని భారీ వర్షంగా పరిగణిస్తారు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా లోతట్టు, కొండ ప్రాంతాల ప్రజలతో పాటు స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్ష తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాల కారణంగా నీరు నిలిచిపోయే అవకాశాలు ఉండటంతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల నివాసితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థలు ఆదేశించాయి. స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.