వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులో రోడ్డు కబ్జా.. స్పందించిన అధికారులు నోటీసులు జారీ
వికారాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 22): వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులో రోడ్డు ఆక్రమణల పర్వం తీవ్ర సంచలనంగా మారింది. స్వయంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య సొంత వార్డులోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. సమాజానికి నీతి, న్యాయం బోధించి ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రభుత్వ టీచర్ బాబురావు ధైర్యంగా 40 ఫీట్ల రోడ్డును కబ్జా చేయడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మున్సిపాలిటీలో కఠిన నిబంధనలు అమలు కావాల్సిన చోటే ఇలాంటి అక్రమాలు జరగడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఈ అక్రమ రోడ్డు కబ్జా వ్యవహారంపై సూర్య దినపత్రికలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించారు. అధికారుల బృందం సోమవారం నాడు బాబురావు ఆక్రమించిన ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించి అక్కడ నోటీసులు అంటించారు. అధికారులు స్పందించినప్పటికీ, కేవలం నోటీసులకే పరిమితం కాకుండా లేఅవుట్ ప్లాన్ ప్రకారం ఆక్రమణలను తక్షణమే తొలగించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
సదరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోడ్డుకు అడ్డంగా కాంపౌండ్ వాల్ తో పాటు గేటును కూడా నిర్మించాడని, దీనివల్ల ప్రభుత్వం అక్కడ మంజూరు చేసిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైర్‌పర్సన్ ప్రత్యేక చొరవతో మధు కాలనీలో ప్రతి ఒక్క రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ, ఈ కబ్జా కారణంగా అక్కడ అభివృద్ధి పనులకు పెద్ద విఘాతం ఏర్పడింది.దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరియ్యనట్లు ఉపాధ్యాయుడి అక్రమ నిర్మాణం కాలనీ ప్రగతికి అడ్డుగోడలా మారిందని మున్సిపల్ నివాసితులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేయాలని, 40 ఫీట్ల రోడ్డును యథావిధిగా పునరుద్ధరించి ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించాలని వికారాబాద్ స్థానికులు కోరుతున్నారు.