సీనియర్ ఐపీఎస్ అధికారి నుంచి రూ. 5 కోట్ల పరువునష్టం నోటీసు: బీహార్ సీఎంకు ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ బహిరంగ లేఖ!
సూర్య జాతీయ డెస్క్: బీహార్ సీనియర్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) డైరెక్టర్ జనరల్ కుందన్ కృష్ణన్ పంపిన ఐదు కోట్ల రూపాయల పరువునష్టం లీగల్ నోటీసుపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) బక్సర్ లోక్సభ ఎంపీ సుధాకర్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి ఆయన బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి ఘాటైన 'బహిరంగ లేఖ' రాశారు. ఆ లేఖతో పాటు ఐపీఎస్ అధికారి పంపిన ఆరు పేజీల లీగల్ నోటీసును కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశారు.
వివాద నేపథ్యం – భరత్ భూషణ్ తివారీ ఎన్కౌంటర్ కేసు:
భోజ్పూర్ జిల్లాలోని బిలౌటీ గ్రామంలో ఈ ఏడాది జూన్ 17న జరిగిన వివాదాస్పద ఎన్కౌంటర్లో భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఆపరేషన్లో ఎస్టీఎఫ్ బలగాలు కూడా పాల్గొన్నాయి. ఈ ఘటనపై ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి, అప్పటి ఎస్టీఎఫ్ డీజీ కుందన్ కృష్ణన్ నిర్ణయాత్మక పాత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఐపీఎస్ అధికారి కుందన్ కృష్ణన్, న్యాయ విచారణ కమిషన్ విచారిస్తున్న సున్నితమైన అంశంపై ఎంపీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ లీగల్ నోటీసు జారీ చేశారు. 15 రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఐదు కోట్ల రూపాయల పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు చేపడతామని ఆ నోటీసులో హెచ్చరించారు.
ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా? – సీఎంకు ఎంపీ ప్రశ్నలు:
ఈ నోటీసులపై తగ్గేదేలేదని తేల్చిచెప్పిన సుధాకర్ సింగ్, బెదిరింపులకు లేదా పోలీసు యూనిఫామ్కు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన పలు ప్రశ్నలు సంధించారు:
* ఒక సివిల్ సర్వెంట్ లేదా ఐపీఎస్ అధికారి ఎన్నికైన ప్రజాప్రతినిధికి పరువునష్టం నోటీసు పంపే ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా హోం మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకున్నారా అని నిలదీశారు.
* గత రెండు దశాబ్దాలుగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తాము ప్రజల సేవకులమనే విషయాన్ని మరిచిపోయి పాలకుల్లా వ్యవహరిస్తున్నారని, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులనే గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
* ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పోలీసు చర్యలు, అధికారుల పాత్రపై నిలదీసే అధికారం పార్లమెంట్ సభ్యుడిగా తనకు ఉందని, న్యాయపరమైన బెదిరింపులతో ప్రజల గొంతును నొక్కలేరని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై అటు ముఖ్యమంత్రి కార్యాలయం గానీ, ఐపీఎస్ అధికారి కుందన్ కృష్ణన్ గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. రాజకీయ, పోలీసు వర్గాల మధ్య తలెత్తిన ఈ తాజా లేఖాస్త్రం బీహార్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.