ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు మంత్రివర్గ ఆమోదం
సూర్య తెలంగాణ డెస్క్: అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. బహుభార్యత్నానికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా నిషేధం విధించే నిబంధనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అస్సాం సర్వీసెస్ డిసిప్లిన్ అండ్ అప్పీల్ రూల్స్ 1964 సవరణకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో పాలనాపరమైన క్రమశిక్షణను మరింత కఠినతరం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మంత్రివర్గం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోని అన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. బహుభార్యాత్వ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసే క్రమంలోనే సర్వీస్ రూల్స్‌ను సవరించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లఘించి బహుభార్యత్నానికి పాల్పడినట్లు రుజువైతే తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడంతో పాటు రాబోయే కాలంలో ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా వారు ఎంపిక కాకుండా శాశ్వత అనర్హత వేటు పడనుంది. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో నైతిక ప్రమాణాలు మరింత మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదే కేబినెట్ సమావేశంలో ఉద్యోగార్థులకు ఊరటనిచ్చే మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 4 పోస్టుల భర్తీ ప్రక్రియలో మాజీ సైనికోద్యోగులకు (ఎక్స్-సర్వీస్‌మెన్) ఊరట కల్పిస్తూ వయోపరిమితిని పెంచారు. మాజీ సైనికోద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గరిష్ట వయోపరిమితి సడలింపును 45 సంవత్సరాలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా రక్షణ రంగంలో సేవలు అందించి రిటైరైన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
ఈ ఉపాధి మరియు సర్వీస్ నిబంధనల సవరణలతో పాటు రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా కేబినెట్ పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థతో అస్సాం ప్రభుత్వం ప్రతిష్టాత్మక రోప్‌వే డెవలప్‌మెంట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రాష్ట్రంలోని గుర్తించబడిన రవాణా మార్గాల్లో ప్రయాణ సౌలల్యం కోసం ఆధునిక రోప్‌వే ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం ఒక బలమైన వ్యవస్థాగత రూపకల్పనను అందించనుంది. ఈ సమావేశంలో తీసుకున్న సమగ్ర నిర్ణయాలు రాష్ట్రంలో నూతన పాలనా సంస్కరణలకు నాంది పలుకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.