సీబీఐ విస్తృత సోదాల్లో ఎలాంటి ఆధారాలూ లభించలేదు: ఎన్నికల ముందు బీజేపీ కుట్రలంటూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ధ్వజం!
సూర్య జాతీయ డెస్క్:** తమ క్యాంప్ కార్యాలయం సహా వివిధ ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్వహించిన సుదీర్ఘ సోదాల్లో ఎలాంటి ఆధారాలు గానీ, అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లు గానీ లభించలేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని, తనను బద్నాం చేసేందుకే బీజేపీ ఇలా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
చండీగఢ్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం మరియు ముఖ్యమంత్రి ఓఎస్డీ రాజ్బీర్ ఘుమాన్ నివాసాలు, కార్యాలయాలపై సుమారు 12 గంటల పాటు సీబీఐ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ పరిణామంపై సీఎం భగవంత్ మాన్ స్పందిస్తూ.. "ఎన్నికలు రాగానే ఈడీ, సీబీఐలను దుర్వినియోగం చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. గంటల తరబడి జల్లెడ పట్టినా ఏమీ దొరకలేదు. మేం ప్రజాసేవ కోసం వచ్చాం తప్ప బదిలీలు, పైరవీలతో లంచాలు తీసుకునేందుకు రాలేదు. ఎలాంటి వాట్సాప్ చాట్‌లు గానీ, అక్రమ లావాదేవీల పత్రాలు గానీ లభించలేదు" అని స్పష్టం చేశారు.
దశాబ్దాల నాటి కేసులను మూలనపెట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మాత్రం 24 గంటల వ్యవధిలోనే రంగంలోకి దిగుతున్నాయని ఆయన విమర్శించారు. పంజాబ్ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి అందిస్తున్న అపూర్వ ఆదరణను చూసి ఓర్వలేకనే కేంద్రంలోని అధికార పార్టీ తీవ్ర నిరాశతో ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. దర్యాప్తు సంస్థల దాడులకు పంజాబ్ ప్రజలు భయపడబోరని, బెదిరింపు రాజకీయాలను దీటుగా తిప్పికొడతామని భగవంత్ మాన్ హెచ్చరించారు.